Varra Ravindra Reddy: వర్రా రవీంద్రారెడ్డిని నిన్న మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నాం: పోలీసులు

Police introduces Varra Ravindra Reddy before media

  • కూటమి నేతలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు
  • పరారైన వర్రా రవీంద్రారెడ్డి
  • ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు
  • ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న వైనం
  • నేడు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 

పరారీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కర్నూలు రేంజి డీఐజీ, కడప ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వర్రా రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ అనే నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరిద్దరూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని డీఐజీ తెలిపారు. 

వర్రా రవీంద్రారెడ్డిని నిన్న మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతి సిమెంట్ కంపెనీలో పనిచేశాడని చెప్పారు. కాగా, డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా వినియోగించుకున్నారని వివరించారు. వీరు జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కుటుంబంలోని మహిళలు, పిల్లలపైనా పోస్టులు పెట్టారని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టేవారు రాక్షస జాతికి చెందినవారని, నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే వీరి లక్ష్యమని డీఐజీ వివరించారు.

ఇలాంటి పోస్టులు పెట్టేవారిని ఇప్పటిదాకా 45 మందిని గుర్తించామని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. నేతల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారని తెలిపారు. నిందితులకు 40 యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. వీరు తమ యూట్యూబ్ చానళ్ల ద్వారా కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని పోలీసులు వివరించారు. 

నిందితులు వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై తీవ్రమైన దూషణలు చేశారని వెల్లడించారు. ఇలాంటి వారికి అరబ్ దేశాల్లో అయితే తీవ్రమైన శిక్షలు ఉంటాయని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించామని చెప్పారు. 

వీరంతా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ జగన్ కనెక్ట్స్ కు 2022 నుంచి సజ్జల భార్గవరెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతున్నారని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలంతా... సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమ్మారెడ్డి సూచనల ప్రకారం పనిచేస్తుంటారని వివరించారు.

  • Loading...

More Telugu News