Ponnam Prabhakar: ఆ కేసులో ఎవరిని జైల్లో పెడతామో చెప్పలేదు... కేటీఆర్ మాత్రం మోకరిల్లేందుకు ఢిల్లీకి వెళుతున్నారు: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar says ktr going to Delhi to escape from cases

  • తనపై వస్తున్న కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్ అని విమర్శ
  • కేంద్రం సాయం కోసం వెళదామంటే ఎవరూ రావడం లేదని ఆరోపణ
  • కార్ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి కోరినట్లు వెల్లడి
  • ఆత్మరక్షణ కోసం కేటీఆర్ ఢిల్లీకి వెళుతున్నాడన్న మంత్రి

కార్ రేసింగ్ కేసులో తాము ఎవరినీ జైల్లో పెడతామని చెప్పలేదని, కానీ కేటీఆర్ మాత్రం కేంద్రం వద్ద మోకరిల్లేందుకు ఢిల్లీకి పరుగెత్తుతున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తనపై వస్తున్న ఆరోపణలు నుంచి, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఢిల్లీ టూర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు కేంద్రం సహయం కోసం ఢిల్లీకి కలిసి వెళదామంటే రావడం లేదని, కేసుల గురించి మాత్రం వెళుతున్నారని ఆరోపించారు.

ఢిల్లీకి వెళ్లి అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తానని కేటీఆర్ చెబుతున్నారని... కానీ కార్ రేస్‌కు సంబంధించిన విచారణకు గవర్నర్ అనుమతిని తాము కోరడంతోనే ఆయన ఢిల్లీకి వెళుతున్నారన్నారు. తాము ప్రత్యేకంగా ఎవరినీ జైల్లో పెడతామని చెప్పలేదని తెలిపారు. కానీ తన ఆత్మరక్షణ కోసం కేంద్రం వద్ద మోకరిల్లేందుకు వెళుతున్నాడని వ్యాఖ్యానించారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయని భావిస్తే ఫిర్యాదు చేసుకోవచ్చని... కానీ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నట్లుగా తెలుస్తోందన్నారు.

కేటీఆర్ విచారణకు సహకరించి... చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14 నుంచి ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుతామన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తామన్నారు. రవాణాశాఖకు మరింత గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో తెలంగాణ రవాణా శాఖ లోగోను విడుదల చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News