Gautam Gambhir: గంభీర్ ను మీడియా ముందుకు పంపించకపోవడమే మంచిది: మంజ్రేకర్
- బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళుతున్న టీమిండియా
- మీడియాతో మాట్లాడిన గంభీర్
- గంభీర్ మీడియాతో మాట్లాడిన తీరును తప్పుబట్టిన మంజ్రేకర్
- గంభీర్ తెరవెనుక ఉండడమే మేలని వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లేముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంపై మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇలాంటి మీడియా సమావేశాలకు గంభీర్ ను పంపవద్దని బీసీసీఐకి సూచించాడు. గంభీర్ మీడియా ముందుకు రావడం కంటే, తెరవెనుక ఉంటూ జట్టు కోచింగ్ పనులు చూసుకోవడమే మంచిదని హితవు పలికాడు.
"గంభీర్ మీడియాతో మాట్లాడుతుండగా ఇప్పుడే చూశాను. అతడిని మీడియా ముందుకు పంపకుండా ఉంటేనే బాగుంటుంది. మీడియాతో ఎలా వ్యవహరించాలో గంభీర్ కు తెలియదు. మీడియాతో ఏం మాట్లాడాలో అంతకన్నా తెలియదు. మీడియాతో మాట్లాడే విషయంలో అతడి కంటే రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ ఎంతో బెటర్" అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
ఇవాళ భారత జట్టు ఆసీస్ పర్యటనకు బయల్దేరేముందు గంభీర్ మీడియాతో మాట్లాడాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ పై ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండించాడు. భారత క్రికెట్ తో పాంటింగ్ కు ఏంటి సంబంధం? పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి మాట్లాడితే బాగుంటుంది అని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ, రోహిత్ ల ఫామ్ పై తానేమీ ఆందోళన చెందడంలేదని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే సంజయ్ మంజ్రేకర్ విమర్శనాత్మకంగా స్పందించాడు.