Bandi Sanjay: రోడ్డు ప్రమాదం... బండి సంజయ్ చొరవతో నిలబడిన మహిళ ప్రాణం!
- హుజూరాబాద్ సమీపంలో లారీ కింద ఇరుక్కున్న మహిళ
- అదే మార్గంలో వెళుతున్న బండి సంజయ్
- విషయం తెలిసి తన కాన్వాయ్‌ని ఆపి చొరవ తీసుకున్న కేంద్ర సహామంత్రి
- ఆసుపత్రి ఖర్చులు తానే భరిస్తానని డాక్టర్లకు చెప్పిన వైనం
కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ చొరవతో ఓ ప్రాణం నిలబడింది. ఆయన కరీంనగర్ జిల్లా నుంచి ములుగు వెళుతున్న సమయంలో... ప్రమాదవశాత్తూ ఓ మహిళ లారీ కింద ఇరుక్కున్న విషయాన్ని గుర్తించి తన సిబ్బందితో కలిసి సాయం అందించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. ఆమె లారీ కింద పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో లారీ డ్రైవర్ హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో ఆపేశాడు.
ఆ సమయంలో బండి సంజయ్ అక్కడి నుంచి ములుగు వెళుతున్నారు. విషయం తెలియడంతో ఆయన ఆగారు. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో యువతి జుట్టు చిక్కుకుపోయింది. రక్తం బాగా పోయింది. ఆమెను చూసిన బండి సంజయ్ ధైర్యం చెప్పారు. కేంద్రమంత్రి సిబ్బంది, స్థానికులు ఆమె జుత్తును కత్తిరించి బయటకు తీశారు. కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందించాలని, ఖర్చును తానే భరిస్తానని బండి సంజయ్ డాక్టర్లకు చెప్పారు.