Revanth Reddy: మేం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తే... మోదీ రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Modi is trying to erase Minority reservations

  • మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలని సీఎం పిలుపు
  • మెజార్టీ, మైనార్టీ ప్రజలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్న సీఎం
  • దేశంలో ఉన్నవి మోదీ వర్గం... గాంధీ వర్గమని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని... కానీ వాటిని రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మెజార్టీ, మైనార్టీ ప్రజలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారు అన్నారు.

స్వాతంత్ర్యం రాగానే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌ను విద్యాశాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఆయన విద్యా వ్యవస్థలో ఎన్నో విధానాలు తీసుకువచ్చారన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనార్టీలకు ఇచ్చామన్నారు.

దేశంలో ఉన్నవి రెండే వర్గాలు అని... ఒకటి మోదీ వర్గం కాగా, రెండోది గాంధీ వర్గం అన్నారు. హిందూ, ముస్లిం భాయి భాయి అన్నదే తమ విధానమన్నారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా యాత్ర చేశారని తెలిపారు. 

  • Loading...

More Telugu News