KTR: మూసీ ప్రాంతంలో మైనార్టీల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోంది: కేటీఆర్
- కాంగ్రెస్ మూసీ ప్రాంతంలో మైనార్టీల ఇళ్లను కూలుస్తోందని విమర్శ
- కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్ పాలన సాగిందన్న కేటీఆర్
- బీఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడి
మూసీ పరీవాహక ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల ఇళ్లను కూలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... హిందూ, ముస్లిం సహృద్భావనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్ పాలన సాగిందని తెలిపారు.
ఒకరినొకరు గౌరవించుకునే, సంస్కరించుకునే మంచి వాతావరణం ఉండేదన్నారు. గురుకులాలు ఏర్పాటు చేసి మైనార్టీ పిల్లల దశను మార్చామన్నారు. మైనార్టీ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2,751 మంది విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్ లు ఇచ్చామన్నారు. నాంపల్లిలోని అనాథ శరణాలయానికి రూ.200 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమి ఇచ్చామని తెలిపారు.
మైనార్టీల కోసం ఆధునిక భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు. మైనార్టీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి సాయం చేశామన్నారు. ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేల వేతనం ఇచ్చామని గుర్తు చేశారు. పదవుల్లోనూ మైనార్టీలకు తాము ప్రాధాన్యతను ఇచ్చామని తెలిపారు.
మహమూద్ అలీనీ తొలి ఉపముఖ్యమంత్రిగా చేశామని చెప్పారు. వరంగల్‌కు... తొలిసారి ముస్లింకు డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొహబ్బత్ కీ దుకాన్ అంటూ మైనార్టీలపై విరుచుకుపడుతోందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు.