US Presidential Polls: ఆరిజోనా, నెవడాలో ఇంకా వెలువడని ఫలితాలు.. కారణం ఇదే!

Still Continue counting in Arizona and Nevada

  • ఆరిజోనాలో మెయిల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్న ఓటర్లు
  • నెవడాలో రేపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్న పోస్టల్ బ్యాలెట్లు 
  • లెక్కింపునకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం
  •  ఈ రెండు చోట్లా ఇప్పటి వరకు ట్రంప్‌కే ఆధిక్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ మరోమారు విజయం సాధించారు. జనవరిలో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. అయినప్పటికీ ఇంకా రెండు రాష్ట్రాల ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఆ రెండింటిలో ఒకటి ఆరిజోనా కాగా, మరోటి నెవడా. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై ఇంకా చిక్కుముడి వీడలేదు. నెవడాలో ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 94 శాతం కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ రిపబ్లికన్లకు 51 శాతం ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 47.2 శాతం ఓట్లు లభించాయి. ఇక, ఆరిజోనాలో ఇప్పటి వరకు 70 శాతం ఓట్లు లెక్కించగా ట్రంప్‌కు 52.3, ప్రత్యర్థి కమలా హారిస్‌కు 46.8 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఈ రెండు చోట్లా పూర్తి ఫలితాలు వెలువడేందుకు కనీసం 10 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆరిజోనాలో చాలామంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయడమే ఇందుకు కారణం కాగా, నెవడాలో పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరేందుకు రేపటి (9వ తేదీ) వరకు సమయం పడుతుందని చెబుతున్నారు. 2020లో ఎన్నికల తర్వాత ఐదు రోజులకు ఇక్కడ ఫలితాలు వెలువడ్డాయి. 

ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను మార్చలేవు. విజయానికి అవసరమైన 270 ఓట్లను ట్రంప్ ఇప్పటికే సాధించారు. ట్రంప్ ఖాతాలో ఇప్పటికే 295 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అటు కమల 226 ఓట్లు సాధించారు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలు ఆమె సొంతమైనా ఆమెకు ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. ఆధిక్యం పెరుగుతుంది అంతే.

  • Loading...

More Telugu News