Kapil Dev: రూమ్‌లో కూర్చుంటే కుదరదు.. ప్రాక్టీస్ చేయండి.. భారత ప్లేయర్లకు కపిల్ దేవ్ సూచన!
- ఇటీవల స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టు సిరీస్ వైట్‌వాష్
- ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న టీమిండియా
- ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్
- ఈ నేపథ్యంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న కపిల్
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ వైట్‌వాష్ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తాజాగా కీలక సూచన చేశారు. రూమ్‌లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదని, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదని అన్నారు. క్రికెట్ బేసిక్స్‌కు తిరిగి వెళ్లి తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు.
"క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. తీవ్రంగా సాధన చేయండి. రూమ్‌లో కూర్చుని మెరుగవుతానని మీరనుకుంటే ఎప్పటికీ జరగదు. ప్రస్తుతం మీకు కష్టకాలం నడుస్తోంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి" అని కపిల్ క్రికెట్ నెక్స్ట్‌తో అన్నారు.
కాగా, ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో భారత జట్టు ఏ మేర రాణిస్తుందో చూడాలి. ప్రస్తుత జట్టు ఫామ్ దృష్ట్యా టీమిండియాకు ఆసీస్ గడ్డపై సవాళ్లు ఎదురుకావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత గడ్డపై ఏ జట్టైనా బలంగానే ఉంటుందనేది కాదనలేని వాస్తవం. అందులోనూ నాణ్యమైన బౌలర్లు కలిగిన కంగారూ జట్టును అడ్డుకోవడం భారత బ్యాటర్లకు అంత సులువేమీ కాదు.
ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజీటీలో భారత్‌ను తమ జట్టు 3-1 తేడాతో ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. భారత బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ విభాగం స్ట్రాంగ్‌గా లేదని అభిప్రాయపడ్డాడు. మహ్మద్ షమీ లేకపోవడం టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు అని చెప్పుకొచ్చాడు.