Prabhakar Rao: ఫోన్ అక్ర‌మ ట్యాపింగ్ కేసు.. ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్‌రావు గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన షాకింగ్ విష‌యం!

Ex SIB OSD Prabhakar Rao Gets Green Card in America

  • తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు
  • ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరు
  • కేసు ద‌ర్యాప్తు పురోగ‌తిపై ప్ర‌భావం
  • ప్ర‌భాక‌ర్‌రావు ఇప్ప‌ట్లో స్వ‌దేశానికి తిరిగే వ‌చ్చే అవ‌కాశం  లేద‌ని చ‌ర్చ  

తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ అక్ర‌మ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్ర‌భాక‌ర్‌రావు గురించి షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న‌కు అమెరికాలో శాశ్వ‌త నివాసానికి వీలు క‌ల్పించే గ్రీన్‌కార్డు మంజూరైన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ స్థిర‌ప‌డిన ప్ర‌భాక‌ర్‌రావు కుటుంబ స‌భ్యుల స్పాన్స‌ర్‌షిప్‌తో ఆయ‌న‌కు గ్రీన్‌కార్డు మంజూరైన‌ట్లు స‌మాచారం. 

ఈ కీల‌క ప‌రిణామం కేసు ద‌ర్యాప్తును ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. ఇక ఫోన్ అక్ర‌మ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భాక‌ర్‌రావు అమెరికాకు వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఎస్ఐబీ అద‌న‌ప్పు ఎస్‌పీ ర‌మేశ్ మార్చి 10న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, 11న యూఎస్ వెళ్లిన ప్ర‌భాకర్‌రావు అప్ప‌టి నుంచి అక్క‌డే ఉండిపోయారు. 

మ‌రోవైపు కేసు ద‌ర్యాప్తులో భాగంగా పోలీసులు న‌లుగురు పోలీస్ అధికారుల‌ను అరెస్టు చేయ‌డంతో పాటు ప్ర‌భాక‌ర్‌రావును కేసులో ప్ర‌ధాన నిందితుడిగా చేర్చారు. కోర్టులో అభియోగ‌ప‌త్రం న‌మోదు చేసి, ఆయ‌న్ను అమెరికా నుంచి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు చేశారు. 

వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన‌ట్లు ప్ర‌భాక‌ర్‌రావు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మూడు నెల‌ల కాల‌ప‌రిమితితో కూడిన‌ వీసాపై వెళ్లిన తాను జూన్‌లో తిరిగి వ‌స్తాన‌ని తెలిపారు. కానీ, వీసా గ‌డువు ముగిసినా ఆయ‌న అక్క‌డే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న వీసా గ‌డువును మ‌రో ఆరు నెల‌ల‌కు పొడిగించుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.  

దాంతో ఆయ‌న‌పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయ‌డంతో పాటు పాస్‌పోర్టును ర‌ద్దు చేశారు. ఆ విష‌యాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసుల‌కు చేర‌వేసే ప్ర‌య‌త్నాల్లో పోలీసులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాక‌ర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైన‌ట్లు స‌మాచారం. 

కాగా, గ్రీన్‌కార్డుదారుకు అగ్ర‌రాజ్యంలో శాశ్వ‌త నివాసానికి అనుమ‌తి ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. దాంతో ప్ర‌భాక‌ర్‌రావు ఇప్ప‌ట్లో స్వ‌దేశానికి తిరిగే వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.  

  • Loading...

More Telugu News