Vijayanagaram: ఏపీ హైకోర్టు కీలక తీర్పుతో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై సందిగ్దత

Vijayanagaram MLC By Election Issue

  • ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు
  • ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించిన వైసీపీ 
  • అనర్హత పిటిషన్‌పై రఘురాజు వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్‌కు సూచించిన హైకోర్టు

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు జూన్ 3న అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ క్రమంలో ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్ధిని కూడా ప్రకటించింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని ఉప ఎన్నికకు అభ్యర్ధిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే మండలి చైర్మన్ తనపై వేసిన అనర్హత వేటుపై ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నిన్న (బుధవారం) ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. 

ఎమ్మెల్సీగా రఘురాజు‌పై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే అనర్హత పిటిషన్‌పై రఘురాజు వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం నేపథ్యంలో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక ఆగిపోతుందా ..? ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..! అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  

Vijayanagaram
AP High Court
MLC By Election
YSRCP
  • Loading...

More Telugu News