Konda Surekha: రాహుల్ గాంధీ కులంతో మీకేం పని? ఆయన ఇంటికి వెళితే చెబుతారు: కొండా సురేఖ

Konda Surekha blames BJP for asking Rahul Gandhi caste
  • రాహుల్ గాంధీ కులం తెలియాలంటే కులగణన చేపట్టాలని బీజేపీకి చురక
  • కుల వివక్ష పోగొట్టడానికే తెలంగాణలో కులగణన చేపట్టినట్లు వెల్లడి
  • కులగణనతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్న మంత్రి
రాహుల్ గాంధీ కులంతో బీజేపీకి ఏం పని? అంతగా కావాలనుకుంటే కులపత్రంతో ఆయన ఇంటికి బీజేపీ వెళితే తప్పకుండా చెబుతారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. గాంధీ భవన్‌లో మంత్రులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాహుల్ గాంధీ కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీకి చురక అంటించారు. బీజేపీ ఎప్పుడూ కొన్ని వర్గాలకే న్యాయం చేస్తుందన్నారు.

కుల వివక్షను పోగొట్టడానికే తెలంగాణలో కులగణన చేపట్టినట్లు తెలిపారు. కులగణనతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ కులగణనతో రాష్ట్రవ్యాప్తంగా అందరి ఆర్థిక పరిస్థితులను అంచనా వేయవచ్చని తెలిపారు. బీసీ కులగణనతో కులాలవారీగా రాజకీయ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందన్నారు. సమగ్ర సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఎక్కడా వెల్లడి చేయకుండా, భద్రంగా ఉంచబడుతుందన్నారు.

1831లో బ్రిటీష్ కాలంలో కులగణన జరిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. కులగణనను రాహుల్ గాంధీ సవాల్‌గా తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే కులగణన అన్నారు.
Konda Surekha
Telangana
Rahul Gandhi
BJP

More Telugu News