US Presidential Polls: కాసేపట్లో ట్రంప్ ప్రసంగం

Donald Trump Watch Party At Palm Beach

  • మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడనున్న ట్రంప్
  • ఫ్లోరిడాలోని తన బీచ్ హౌస్ లో వాచ్ పార్టీ
  • స్పీచ్ రద్దు చేసుకున్న కమలా హ్యారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం 247 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ లీడ్ లో దూసుకెళుతున్నారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిశాక ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న తన మార్ ఎ లాగో నివాసానికి చేరుకున్నారు. అక్కడే తన మద్దతుదారులకు వాచ్ పార్టీ ఇస్తూ ఫలితాల సరళిని గమనిస్తున్నారు. స్వింగ్ స్టేట్లు సహా అన్నిచోట్ల తనకు అనుకూలంగా ఫలితాలు వస్తుండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్టీకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫలితాల్లో లీడ్ లో దూసుకుపోతుండడం, స్వింగ్ స్టేట్లు ఏడింటిలోనూ తన ఆధిక్యం కొనసాగుతుండడంతో విజయం తనదేనని ఆయన భావిస్తున్నారు. మరికాసేపట్లో దేశవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడనున్నారు. 

మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని భావించిన కమలా హ్యారిస్ ఫలితాలతో డీలా పడ్డారు. విజయంపై పూర్తి ధీమాతో ముందస్తుగా ఏర్పాటు చేసిన స్పీచ్ ను ఆమె రద్దు చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హ్యారిస్ మంగళవారం రాత్రి వాచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే, కమలా హ్యారిస్ వెనుకంజలో ఉండడం, ట్రంప్ విజయం దాదాపు ఖరారవడంతో ఆమె మద్దతుదారులు కన్నీళ్లతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హోవార్డ్ యూనివర్సిటీ నుంచి కమల మద్దతుదారులు విచారంగా బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

US Presidential Polls
Donald Trump
Palm Beach Estate
Watch Party
Kamala Harris
Trump Speech

More Telugu News