Family Suicide: బాసర వద్ద గోదావరిలో దూకిన కుటుంబం.. తండ్రీకూతుళ్ల గల్లంతు

Family Suicide Attempt At Basara Godavari River

  • తల్లిని కాపాడి ఒడ్డుకు చేర్చిన స్థానికులు
  • అప్పుల బాధ తట్టుకోలేక కఠిన నిర్ణయం
  • రూ. 3 లక్షల రుణానికి వడ్డీ, చక్రవడ్డీ పేరుతో వేధింపులు

వ్యాపారంలో నష్టాలు, అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక ఓ కుటుంబం గోదావరి నదిలో దూకింది. బాసర పుణ్యక్షేత్రంలో నదీ స్నానం కోసమని దిగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి స్పందించేలోగా తండ్రీకూతుళ్లు నీళ్లలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం కాపాడి ఒడ్డుకు చేర్చారు. బాసరలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ లో ఉప్పలించి వేణు, అతడి భార్య అనురాధ, కూతురు పూర్ణిమ ఉంటున్నారు. వేణు స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యాపారం కోసం గంజ్ మార్కెట్ లోని వ్యాపారస్తులు రోషన్, వికాస్ ల దగ్గర వేణు రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఈ మొత్తానికి వడ్డీ, చక్రవడ్డీ కట్టాలంటూ రోషన్, వికాస్ లు వేధింపులకు దిగారు. డబ్బులు చెల్లించకపోతే మనుషులను పంపించి వేణు భార్య, కూతురులను వివస్త్రలను చేస్తామని బెదిరించారు.

ఓవైపు వ్యాపారం అనుకున్నంత బాగా జరగకపోవడం, మరోవైపు వీరి వేధింపులు.. ఈ క్రమంలో వేణు మనస్తాపానికి గురయ్యాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం బాసర చేరుకుని గోదావరిలో దూకారు. కాగా, స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ అనురాధ అప్పుల వాళ్ల వేధింపులను బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. వేణు, పూర్ణిమల కోసం నదిలో గాలిస్తున్నారు.

Family Suicide
Godavari River
Basara Temple
Nizamabad District
  • Loading...

More Telugu News