Sridhar Babu: బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలు

Sridhar Babu ten questions to brs

  • తెలంగాణలో అమరవీరుల సంఖ్యను బీఆర్ఎస్ తగ్గించిందని విమర్శ
  • అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని మండిపాటు
  • పార్టీని విలీనం చేస్తామని మాట తప్పారన్న శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో అమరవీరుల కుటుంబాల సంఖ్యను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడతలవారీగా తగ్గించిందని ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమంలో బలిదానాలపై నాడు కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. మొత్తం 1,200 మంది బలిదానం చేసుకున్నట్లు సీఎం హోదాలో కేసీఆర్ నాడు చెప్పారన్నారు.

కానీ ఆ తర్వాత విడతలవారీగా తగ్గించుకుంటూ వచ్చి అమరవీరుల సంఖ్యను 1,200 నుంచి 585కు తగ్గించారన్నారు. మిగిలిన 615 మంది అమరవీరుల సంఖ్య ఏమైందని ప్రశ్నించారు. అధికార పార్టీపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

- బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను ఎందుకు విస్మరించింది?
- బలిదానాలను 1,200 నుంచి 585కు ఎందుకు తగ్గించారు? మిగతా 615 మంది ఏమయ్యారో చెప్పాలి?
- అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
- అధికారంలోకి వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని కేసీఆర్ చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు. ఈ హామీలు నెరవేర్చారా?
- సోనియమ్మను పొగిడిన వాళ్లే ఇప్పుడు కించపరచడం లేదా? పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి మాట తప్పింది ఎవరు?
- అధికారంలోకి రాగానే నిరుద్యోగం అనేది లేకుండా చేస్తామని చెప్పి... మోసగించలేదా?
- గ్రూప్-1 పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించని అసమర్థత ఎవరిది? నిరుద్యోగుల ఉసురు పోసుకుంది ?
- డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు? కేజీ టు పీజీ విద్య అమలు చేశారా?
- కేసీఆర్ చెప్పినట్లుగా 16 లక్షలకు కాకపోయినప్పటికీ కనీసం లక్ష ఎకరాలకైనా సాగునీరు అందించారా? 
- ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికే పరిమితం కాలేదా? కానీ మా నేత రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ఉపప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతోంది నిజం కాదా?... అంటూ మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.

Sridhar Babu
Telangana
Congress
  • Loading...

More Telugu News