IPL Auction 2025: ఐపీఎల్ వేలం 2025లో మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ముగ్గురు ఆటగాళ్లు వీళ్లే!

Here are three players who can become the most expensive player in IPL Auction 2025

  • గత వేలంలో రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా ఫ్రాంచైజీ
  • ఆ రికార్డు ఈ మెగా వేలంలో బద్దలు కావడం ఖాయమంటూ అంచనాలు
  • ప్రముఖంగా వినిపిస్తున్న రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, జాస్ బట్లర్ పేర్లు

ఈ నెలాఖరున జరగుతుందని భావిస్తున్న ఐపీఎల్ మెగా వేలంపై క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవర్ని దక్కించుకోబోతున్నాయి?. ఎంత ధర వెచ్చించబోతున్నాయి? అనే చర్చలు, విశ్లేషణలు క్రికెట్ వర్గాల్లో మొదలయ్యాయి. చివరిసారిగా జరిగిన వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. ఇక మరికొన్ని రోజుల్లో జరగనున్న మెగా వేలంలో పలువురు టాప్ క్రికెటర్లు అందుబాటులో ఉండడం, ఫ్రాంచైజీలు ఖర్చు చేసే డబ్బు పరిమితిని రూ.120 కోట్లకు పెంచడంతో ఈసారి వేలంలో స్టార్క్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. చరిత్ర తిరగ రాయగల ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు ప్లేయర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ క్రికెటర్లు ఎవరో ఒకసారి గమనిద్దాం..

రిషబ్ పంత్‌పై భారీ అంచనాలు
మెగా వేలంలో అత్యంత డిమాండ్ ఉంటుందని భావిస్తున్న ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని విడుదల చేసిన నాటి నుంచి అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పంత్ కోసం దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని, రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మంచి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం అన్వేషిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా భారీ ధరకు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉందని క్రికెట్ సర్కిల్స్‌లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

హాట్ కేక్‌గా మారిన ఇషాన్ కిషన్
ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ఇషాన్ కిషన్‌కు కూడా భారీ ధర పలికే అవకాశం ఉందని అంచనా నెలకొంది. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఇషాన్‌ను ముంబై ఇండియన్స్ ఏకంగా 15.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే ముంబై ఇండియన్స్ ఇటీవల విడుదల చేసింది. ఇషాన్ రిటెయిన్ చేసుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బౌలర్లను ఊచకోత కోయగల సత్తా ఉన్న ఈ బ్యాటర్‌ను ఫ్రాంచైజీలు భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఓపెనర్‌, వికెట్ కీపర్‌ అవసరమున్న జట్లు ఎనిమిది ఉండడంతో ఇషాన్ భారీ ధర పలకడం ఖాయమనే విశ్లేషణలు వినపడుతున్నాయి. అతడి ధర రూ.25 కోట్ల మార్కును కూడా తాకవచ్చనే అంచనా ఉంది. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. మరి ముంబై ఇండియన్స్ మళ్లీ అతడి కోసం ప్రయత్నిస్తుందా లేదా అనేది చూడాలి.

జాస్ బట్లర్‌కు డిమాండ్ ఖాయం
ఆశ్చర్యకర రీతిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్‌ను విడుదల చేసింది. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా మూడు పాత్రలు పోషించగల ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే ఛాన్స్ ఉందని అంచనాలు నెలకొన్నాయి. బట్లర్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినప్పటికీ అతడి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండడంతో జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది.

  • Loading...

More Telugu News