Vangalapudi Anitha: జగన్‌పై వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం

Vangalapudi Anitha fires at YS Jagan

  • వైసీపీ సైకో బ్యాచ్ అసత్యాలతో ప్రజలను భయానికి గురి చేస్తోందని ఆగ్రహం
  • జగన్ మాత్రం సూక్తులు చెపుతున్నాడని మండిపాటు
  • వైసీపీ హయాంలో జగన్ ఇంటి భద్రత కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సైకో బ్యాచ్ అసత్యాలను ప్రచారం చేస్తూ ఓ వైపు ప్రజలను భయపెడుతుంటే... మరోవైపు జగన్ సూక్తులు చెప్పడం విడ్డూరమన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను సరిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ... వైసీపీ హయాంలో జగన్ ఇంటి భద్రత కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు వైసీపీ దుష్టపాలన పాపాలే కారణమన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వారికి మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతలకు సంబంధించి పోలీసులను సమాయత్తం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అయితే ఏమీ జరగకపోయినప్పటికీ సైకో బ్యాచ్ ఏదేదో జరిగిపోయిందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Vangalapudi Anitha
YSRCP
YS Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News