Rahul Gandhi: రాహుల్ గాంధీజీ... అశోక్ నగర్ వచ్చి చూడండి: హరీశ్ రావు
- యువతను తప్పుదారి పట్టించారని విమర్శ
- విద్యార్థులను మీ ప్రభుత్వం కొట్టిస్తున్న విషయం తెలుసా? అని ప్రశ్న
- అశోక్ నగర్‌ను మీ ప్రభుత్వం 'శోక్' నగర్‌గా మార్చిందని చురక
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వచ్చి చూడాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ యువతను తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. అశోక్ నగర్‌లో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న వీడియోను హరీశ్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి... కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మీరు (రాహుల్ గాంధీ) ఎన్నికలకు ముందు ఏ ప్రాంతంలో అయితే నిరుద్యోగ యువతను కలిసి మాట్లాడారో... అదే ప్రదేశంలో ఈ ప్రజాప్రభుత్వం వారిని పోలీసులతో కొట్టించిందని మీకు తెలుసా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడాలని... వారి ఆవేదనను వినాలని సూచించారు.
అశోక్ నగర్ ను 'శోక' నగరంగా మార్చిన ఈ ప్రజాప్రభుత్వం తీరును చూడాలని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు... కనీసం 10 శాతం కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారని... కానీ టీజీపీఎస్సీగా మార్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఇది జాబ్ లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయిందని చురక అంటించారు.
నిరుద్యోగ భృతి, యువవికాసం కింద ఇస్తామన్న రూ.5 లక్షల హామీని నెరవేర్చడం లేదని దీంతో యువతలో అభద్రతా భావం కనిపిస్తోందన్నారు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు, మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైందన్నారు. కాంగ్రెస్ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తు పెట్టుకుంటుందని హెచ్చరించారు.