AP DGP: గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే: ఏపీ డీజీపీ

AP DGP Dwaraka TirumalaRao Press Meet

  • ప్రస్తుతం వాటిని సరిదిద్దుతున్నామని ద్వారకా తిరుమల రావు వెల్లడి
  • అనంతపురంలో మీడియా సమావేశం
  • ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ తాజాగా స్పందించారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని చెప్పారు. ఈమేరకు మంగళవారం అనంతపురంలో డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని పొరపాట్లు, తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

ఏపీలో మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని డీజీపీ చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదని, ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

భావప్రకటనా స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని రాసుకున్నారు తప్పితే ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదని వివరించారు. ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని గుర్తుచేశారు. దీనిపై నివేదిక తొలుత జీఏడికి వెళుతుందని, అక్కడి నుంచి తమకు అందుతుందని చెప్పారు. తప్పు జరిగితే ఎన్ని ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతూ.. కేరళలో ఓ ఐపీఎస్ కు 20 ఏళ్ల తర్వాత శిక్ష విధించారని డీజీపీ గుర్తుచేశారు.

AP DGP
YSRCP Govt
Pawan Kalyan
DGP Press meet
  • Loading...

More Telugu News