US Presidential Polls: అమెరికా ఎన్నికలు మంగళవారమే ఎందుకు?... దీని వెనుక కారణం ఏమిటి?
- నవంబర్ నెల మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహణ
- 1845లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక
- ఆదివారం జీసస్ ఆరాధన దినం, బుధవారం రైతు మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం
- పంట నూర్పిడి పనులు పూర్తి చేసుకొని నవంబర్‌లో ఖాళీగా ఉండనున్న వ్యవసాయరంగ ఓటర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 ఈ మంగళవారం (నవంబర్ 5) జరగనున్నాయి. ఇప్పుడే కాదు అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా నవంబర్ నెల మొదటి మంగళవారమే పోలింగ్ జరుగుతుంది. ఇందుకు చారిత్రక నేపథ్యం ఉంది. నిజానికి ఎన్నికల ప్రారంభంలో రాష్ట్రాలకు వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరిగేవి. అయితే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో 1845లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. మంగళవారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
ఆ రోజుల్లో అమెరికా జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయరంగానికి చెందినవారే ఉండేవారు. నవంబర్ నెల ఆరంభంలో పంట నూర్పిడి పనులు పూర్తయ్యి ఖాళీగా ఉంటారు కాబట్టి ఓటు వేసేందుకు అనువైన సమయంగా భావించారు. అంతేకాదు ఈ సమయంలో ప్రయాణాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదివారం క్రైస్తవులకు ఆరాధన దినం, బుధవారం రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్లేవారు.
ఇక రవాణా వ్యవస్థ అంతగా లేని ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగే స్థలాలకు చేరుకోవడానికి ఒక రోజు సమయం పట్టేది. దీంతో సోమ, గురువారాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే అన్నింటి కంటే మంగళవారం పోలింగ్ నిర్వహించడం ఉత్తమం అని భావించారు.
నవంబర్‌లో ఓటింగ్.. జనవరిలో ప్రభుత్వ ఏర్పాటు...
ఏ ఇతర దేశంలో లేని విధంగా అమెరికాలో ఎన్నికలకు ఒక క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెల మొదటి మంగళవారం ఓట్లు వేస్తారు. కానీ కొత్త ప్రభుత్వ మాత్రం జనవరిలోనే కొలువుతీరుతుంది. జనవరి నెలలోనే కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది.
అనేక దేశాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు కూడా వీలైనంత వేగంగా జరుగుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి 11 వారాలు వేచిచూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో కీలకమైన ప్రభుత్వ బాధ్యతల మార్పిడి జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ మార్పిడికి గరిష్ఠంగా నాలుగు నెలల సమయం తీసుకోవచ్చు.
నాలుగు నెలల సుదీర్ఘ సమయం తీసుకోవడంతో మహా మాంద్యం సమయంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నాలుగు నెలల నుంచి మూడు నెలలకు తగ్గించారు. 1933లో ఆమోదించబడిన 20వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభ తేదీ జనవరి 20కి మారింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, యంత్రాంగాన్ని సిద్ధం చేసుకొని, అందరూ పరిపాలనా కేంద్రానికి చేరుకొని అన్నివిధాలా సంసిద్ధంగా ఉండడం కోసం ఇంత సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలో విజేతకు ట్రాన్సిషన్ ఫండింగ్‌కు అనుమతి ఇస్తారు. అంతేకాదు దిగిపోనున్న ప్రభుత్వం నుంచి అవసరమైన వివరాలను అడిగి తీసుకోవచ్చు.