Raj Pakala: చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల
- రంగారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ పీఎస్‌లో న్యాయవాదితో కలిసి హాజరు
- ఇటీవల జన్వాడ ఫాంహౌస్ కేసులో కేసు నమోదు చేసిన పోలీసులు
- రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల ఈరోజు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. జన్వాడ ఫాంహౌస్ కేసులో రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదయింది. ఈ క్రమంలో నేడు రంగారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదితో కలిసి రాజ్ పాకాల వచ్చారు.
రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఫాంహౌస్‌కు విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. రాజ్ పాకాలతో పాటు విజయ్ మద్దూరిని కూడా పోలీసులు విచారించారు.
రెండు రోజుల క్రితం, మోకిల పోలీసులు... రాజ్ పాకాలను దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మొన్న విచారణ జరిపిన అనంతరం... అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే రావాలని సూచించడంతో ఈరోజు ఎక్సైజ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.