Rajinikanth: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ స్పందన
- టీవీకే పార్టీ స్థాపించిన హీరో విజయ్
- అక్టోబరు 27న లక్షలాది మందితో బహిరంగ సభ
- విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందన్న తలైవా
తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, ఇటీవలే లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయ రంగానికి బలమైన సంకేతాలు పంపడం తెలిసిందే.
దీనిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందని, టీవీకే పార్టీ తొలి బహిరంగ సభను చక్కగా నిర్వహించారని కొనియాడారు. దీపావళి సందర్భంగా చెన్నైలోని తన నివాసం ఎదుట రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారని, అందుకు అతడిని అభినందిస్తున్నానని తెలిపారు.
అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో టీవీకే పార్టీ భారీ సభ నిర్వహించింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చిన ఈ సభలో విజయ్ ప్రసంగం వాడీవేడిగా సాగింది. బీజేపీ, డీఎంకే పార్టీలను తమ ప్రత్యర్థులుగా ప్రకటించిన విజయ్... ఇతర పార్టీలకు స్నేహ హస్తం చాచారు. అంతేకాదు, 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.