KTR: కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు: ఎక్స్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలివే...!
- కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వెల్లడి
- ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవన్న కేటీఆర్
- ఓ సమయంలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నానని వెల్లడి
కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తమకు మార్గనిర్దేశనం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఎక్స్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 2025 నాటికి కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వెళతారన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగా లేవన్నారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వారిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదన్నారు. తన పద్దెనిమిదేళ్ల రాజకీయ జీవితంలో తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందిపడవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో రాజకీయాల నుంచి బయటకు పోవాలని భావించానని... కానీ ప్రజల కోసం ధైర్యంగా నిలబడటమే మంచిదని కొనసాగుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండటంతో ఆ వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామని తెలిపారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే వరకు తాము ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదన్నారు.
మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై ఏం చర్యలు తీసుకుంటారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. వేచి చూడాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ వంటి మహానగరంలో 144 సెక్షన్ విధించడం షాకింగ్‌కు గురి చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటానికి సోషల్ మీడియానే మనముందున్న ప్రత్యామ్నాయమన్నారు.