Hezbollah: హిజ్బుల్లా కొత్త చీఫ్ ఖాస్సేమ్ ఆసక్తికర ప్రకటన

Lebanese movement could agree to a ceasefire under certain terms sasy Hezbollahs new Chief Naim Qassem

  • కొన్ని షరతులకు ఒప్పుకుంటే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమని వెల్లడి
  • ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తే చర్చలకు వస్తామని ప్రకటన
  • ఇజ్రాయెల్ బలగాల దాడులు మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో కీలక పరిమాణం

ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా స్థావరాలే టార్గెట్‌గా లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులను ఇజ్రాయెల్ సేనలు మరింత ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీమ్ ఖాస్సేమ్ ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారు. 

కొన్ని షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు హిజ్బుల్లా అంగీకరిస్తుందని అన్నారు. సంధి కుదుర్చుకోవడానికి సాధ్యాసాధ్యాలపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం సమావేశమైన నేపథ్యంలో ఖాస్సేమ్ ఈ ప్రకటన చేశాడు. ఇజ్రాయెల్ దాడులు అంతకంతకూ పెరుగుతుండడం కూడా ఖాస్సేమ్ ప్రకటనకు ఒక కారణంగా ఉంది.

గత నెలలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. దీంతో మంగళవారం హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా ఖాస్సేమ్ బాధ్యతలు స్వీకరించాడు. తొలి ప్రసంగంలో మాట్లాడుతూ... లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపడుతున్న వైమానిక, భూతల దాడులను కొన్ని నెలలపాటు ప్రతిఘటించగల సత్తా హిజ్బుల్లాకు ఉందని వ్యాఖ్యానించాడు. అంతలోనే మాట మార్చి సంధికి సిద్ధమని ప్రకటించాడు.

ఇజ్రాయెల్ ప్రతిపాదన చేస్తే చర్చలకు సిద్ధమని ఖాస్సేమ్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా తూర్పు లెబనీస్ నగరం బాల్‌బెక్‌పై కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో మరొక సీనియర్ హిజ్బుల్లా కమాండర్‌ను చంపేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. 

మరోవైపు లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి కూడా ఇజ్రాయెల్‌తో సంధిపై ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో కాల్పుల విరమణపై నిర్ణయం వస్తుందని ఆశాజనకంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అమెరికా ఎన్నికలు జరిగే నవంబర్ 5వ తేదీకి ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని అన్నారు. ఈ మేరకు అమెరికా రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ సలహా ఇచ్చారని చెప్పారు. 

  • Loading...

More Telugu News