Nara Lokesh: గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Met SalesForce President

  • సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • డేటా సేవలరంగ పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణమ‌న్న మంత్రి
  • విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి

సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌ రాగినేనితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. ఈ సంద‌ర్భంగా సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వారు మాట్లాడుతూ... సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం), క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉంద‌న్నారు. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుంద‌ని తెలిపారు. 

సేల్స్ ఫోర్స్ కు సంబంధించిన‌ కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయ‌ని గుర్తు చేశారు. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంద‌న్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ 224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం 36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌ రాగినేని తెలిపారు.

మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ...  ఇ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది త‌మ‌ లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఆర్ఎం సొల్యూషన్‌లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. డేటా సేవల రంగానికి అనువైన వాతావరణం కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు త‌మ‌కు ఉపకరిస్తాయని మంత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు.

Nara Lokesh
SalesForce
Andhra Pradesh
Visakhapatnam
  • Loading...

More Telugu News