MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
- షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- నెలలో రెండు సార్లు దర్యాప్తు అధికారి ముందు హజరు కావాలన్న కోర్టు
- అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశం
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరులకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నేతిగుట్లపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల కోసం సేకరించిన భూముల పరిహారంపై వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన తమపై ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారని ఏఎస్ఆర్‌కే ప్రసాద్, సొహైల్ బాషా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి, మరి కొందరు నిందితులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
పది వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, చార్జిషీట్ దాఖలు చేసే వరకూ లేదా మూడు నెలల వరకూ ప్రతి నెల 1,15 తేదీలలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు దర్యాప్తు అధికారి ముందు హజరు కావాలని ముందస్తు బెయిల్ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని, దిగువ కోర్టులో విచారణ ప్రక్రియకు విధిగా హజరుకావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ షరతులు విధిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.