Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన రికార్డు.. మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్!
![Smriti Mandhana overtakes Mithali Raj becomes Indian player with most centuries in womens ODIs](https://imgd.ap7am.com/thumbnail/cr-20241030tn67218f04ce5e1.jpg)
- భారత్ తరఫున అత్యధిక సెంచరీలు (08) చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి
- మిథాలీ రాజ్ (7 శతకాలు)ను వెనక్కి నెట్టిన స్టార్ బ్యాటర్
- వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ (06)
- ఓవరాల్‌గా వన్డేల్లో ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ 15 సెంచరీలతో అగ్రస్థానం
టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు నమోదు చేసింది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో సెంచరీ బాదిన స్మృతి రికార్డుకెక్కింది. ఇది ఆమెకు 8వ వన్డే శతకం. దీంతో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (7 శతకాలు)ను వెనక్కి నెట్టింది. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ (06) ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే వన్డేల్లో ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ 15 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
కాగా, మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య భారత్ 2-1తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ను 232 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హాలిడే 96 బంతుల్లో 86 పరుగులు చేయడంతో కివీస్ ఒక మోస్తరు స్కోరు చేయగలిగింది.
అనంతరం 233 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఛేజింగ్‌లో షఫాలీ వర్మ (12) త్వరగా ఔట్ అయిన తర్వాత యాస్తికా భాటియా (35)తో కలిసి స్మృతి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ క్రమంలో ఆమె శతకం నమోదు చేసింది. 121 బంతుల్లో 10 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి ఈ ఏడాది ఏడు మ్యాచుల్లోనే మూడు శతకాలు బాదింది.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (59) తో కలిసి స్మృతి 117 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో టీమిండియా అలవోక విజయం సాధించింది.