Crimes On Women: ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి: మానవ హక్కుల కమిషన్ కు వైసీపీ వినతిపత్రం
- ఢిల్లీ వెళ్లిన వైసీపీ బృందం
- ఎన్ హెచ్ఆర్ సీ, ఎన్ డబ్ల్యూసీలకు విజ్ఞాపన
- ఏపీలో పరిస్థితుల పట్ల జోక్యం చేసుకోవాలని వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు నేడు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ)కి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ గుమ్మడి తనూజా రాణి నేతృత్వంలోని వైసీపీ బృందం ఇవాళ ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ (ఎన్ డబ్ల్యూసీ)ను కలిసింది.
ఏపీలో మహిళలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని వైసీపీ నేతలు తెలిపారు. తక్షణమే ఎన్ హెచ్ఆర్ సీ, ఎన్ డబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు 77 జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులతో మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని వైసీపీ బృందం వివరించింది.
వైసీపీ బృందంలో ఎంపీ తనూజా రాణితో పాటు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, వైసీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ ఎంపీలు గొడ్డేటి మాధవి, చింతా అనురాధ ఉన్నారు.