VVS Laxman: న్యూజిలాండ్‌పై పరాజయం ఫలితం.. సౌతాఫ్రికా వైట్‌బాల్ టూర్‌కు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
- సౌతాఫ్రికాతో నాలుగు టీ20లు ఆడనున్న భారత జట్టు
- జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం
- నవంబర్ 8 నుంచి 18 వరకు టీ20 సిరీస్
- సౌతాఫ్రికాతో సిరీస్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ పరాజయం టీమిండియా కోచ్ గౌతం గంభీర్ పీకల మీదికి వచ్చింది. సౌతాఫ్రికాతో త్వరలో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు టీమిండియా మాజీ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలిసింది. నవంబర్ 8 నుంచి 18 వరకు భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టీ20లు ఆడనుంది. ఇందుకోసం నవంబర్ 4న భారత జట్టు సౌతాఫ్రికా బయలుదేరుతుంది. కాగా, భారత టెస్టు జట్టు నవంబర్ 10-11న ఆస్ట్రేలియా బయలుదేరుతుంది.
భారత వైట్‌బాల్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్టు ‘క్రిక్‌బజ్’ పేర్కొంది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన సమయంలోనూ భారత జట్టుకు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరించాడు. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు ఇన్‌చార్జ్‌గా లక్ష్మణ్ వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో శుభమన్‌గిల్ సారథ్యంలోని భారత జట్టు 4-1 తేడాతో విజయం సాధించింది. ఆ టూర్ తర్వాతే గంభీర్‌ను కోచ్‌గా బీసీసీఐ నియమించింది.
సౌతాఫ్రికా టూర్‌పై గవాస్కర్ విమర్శలు
దేశంలో రంజీ ట్రోఫీ సీజన్ మొదలవుతున్న వేళ భారత జట్టు సౌతాఫ్రికా టూర్ పెట్టుకోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియా- ఏ జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ పర్యటనల వల్ల 50 నుంచి 60 మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో లేకుండా పోతారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఈ నెల 25న 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది.