Nara Lokesh: యాపిల్ సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రదేశం: మంత్రి నారా లోకేశ్‌

Minister Nara Lokesh Meet Apple Vice President Priya Balasubramaniam

  • అందుబాటులో నైపుణ్యం గల కార్మికులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయ‌న్న మంత్రి
  • ఒకసారి ఏపీని సందర్శించి పెట్టుబడుల అవకాశాన్ని పరిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి
  • యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా సుబ్రహ్మణ్యంకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సందర్శించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్  (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయ‌న‌ భేటీ అయ్యారు. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి  చెందుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేశ్‌ కోరారు. 

ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో జగజ్జేతగా నిలచిన తీరును ప్రియా బాలసుబ్రహ్మణ్యం వివరించారు. యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైనదిగా పేరొందిన ఐఫోన్, మ్యాక్, వాచ్‌లు, క్లౌడ్ సేవలు, యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్ లను అందిస్తుంద‌ని తెలిపారు. ప్రస్తుతం 3.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొన‌సాగుతోంద‌ని చెప్పారు. గతేడాది 383.29 బిలియన్ డాల‌ర్ల‌ ఆదాయాన్ని పొంది నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా నిలుస్తోందని ప్రియా బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

ఏపీలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్..
మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... యాపిల్ వైస్ ప్రెసిడెంట్ గా కంపెనీ సప్లయ్ చైన్, తయారీ కార్యకలాపాల నిర్వహణలో ప్రియా బాలసుబ్రహ్మణ్యం పోషిస్తున్న పాత్ర అభినందనీయమ‌న్నారు. భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీకి ఆహ్వానించారు. అద్భుత‌మైన‌ మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న త‌మ‌ ప్రభుత్వం.. యాపిల్ విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంద‌న్నారు. ఏపీలోని నాలుగు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో వారికి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవ‌చ్చ‌ని తెలిపారు. 

యాపిల్ సంస్థ‌ కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఏపీని గ్లోబల్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామ‌న్నారు. యాపిల్ సంస్థ కొత్త‌ ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు త‌మవైపు నుంచి కావాల్సిన‌ మద్దతు ఉంటుంద‌న్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విష‌యాన్ని ఈ సంద్భంగా మంత్రి గుర్తు చేశారు. అంతేగాక ఏపీలో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ యాపిల్ సంస్థ‌కు ప్రయోజనకరంగా ఉంటాయ‌ని మంత్రి వివ‌రించారు. 

అంతర్జాతీయ పెట్టుబడులకు మద్దతు ఇస్తాం..
అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన మద్దతును అందిస్తుంద‌ని తెలిపారు. దీనిలో భాగంగా పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. యాపిల్ గ్లోబల్ సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ లో వారికి ఉన్న‌ విస్తృత అనుభవం, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఏపీ చేస్తున్న కృషికి చక్కటి సమన్వయం ఉంటుంద‌న్నారు వినూత్న సప్లయ్ చైన్ పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతంగా పేర్కొన్నారు. త‌మ‌ ప్రభుత్వ ప్రో-బిజినెస్ చర్యలు యాపిల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు. 

పర్యావరణ లక్ష్యాలకు అనువైన ప్రాంతం..
యాపిల్ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్థిరమైన పద్ధతులను అమలు చేస్తున్నామ‌న్నారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ నిబద్ధతతో పనిచేస్తున్నందున యాపిల్‌ వంటి సంస్థలకు త‌మ‌ ప్రభుత్వం భాగస్వామ్య అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన నైపుణ్యం క‌లిగిన టీమ్‌ల‌కు నాయకత్వం వహిస్తున్న యాపిల్‌.. ఏపీలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడానికి త‌మ‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంద‌న్నారు. 

రాష్ట్రంలో యాపిల్ భాగస్వామిగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు త‌మ వద్ద బలమైన విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయ‌ని వివ‌రించారు. యాపిల్‌ సంస్థ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన కార్మికులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న త‌మ‌ రాష్ట్రం యాపిల్ సంస్థ ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రాంతంగా పేర్కొన్నారు.  

పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశం ఏపీ..
ప్రధాన మార్కెట్లకు సులభతరమైన యాక్సెస్ కలిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశమ‌ని మంత్రి లోకేశ్ వివ‌రించారు. తయారీ, పంపిణీలకు త‌మ వద్ద అనువైన ఎకోసిస్టమ్ ఉంద‌న్నారు. లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ నిర్వహణకు భరోసా నిస్తూ ఆధునిక నౌకాశ్రయాలు, రహదారి మార్గాలతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏపీ కలిగి ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. తయారీ యూనిట్లకు అనుకూలమైన విధానాలు, పన్ను ప్రోత్సాహకాలతో ముందున్న ఏపీ.. విదేశీ పెట్టుబడులకు  అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంద‌ని తెలిపారు. 

అన్నివిధాలా అనుకూలతలు ఉన్న ఏపీలో పెట్టుబడుల అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒక‌సారి రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ప్రియా బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించారు. యాపిల్ సంస్థ గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ స్ట్రాటజీలో  భాగస్వామ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. కేవలం ఆర్థిక వృద్ధిని సాధించడమేగాక సాంకేతిక పురోగతి, సమాజాభివృద్ధి లక్ష్యాల సాధనకు త‌మ‌తో కలిసి దీర్ఘకాలిక భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నామని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మంత్రి ప్ర‌తిపాద‌న మేర‌కు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా బాల‌సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇక ఈ స‌మావేశంలో మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.

  • Loading...

More Telugu News