Yanamala Rama Krishnudu: జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే: యనమల రామకృష్ణుడు
- తల్లి, చెల్లిపై కేసులేయడంతో జగన్ పాతాళంలో పడిపోయారన్న యనమల
- చివరికి జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని విమర్శ
- భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలేనని చురక
- ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం
తల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు. చివరికి జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇది ఆస్తుల వివాదం కాదని, రాజకీయ ఆత్మహత్యేనని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చానని జగన్ చెప్పినా... ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆయనకు ఈ రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ సందర్భంగా జగన్‌పై యనమల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అనేది పగటి కలేనని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.