Two Flights: ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాలు ప్రారంభించడం ఇదే తొలిసారి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Union minister Ram Mohan Naidu inaugurates two flight services between Visakha and Vijayawada

  • విశాఖ-విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులు ప్రారంభం
  • రెండు నగరాల మధ్య కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయన్న రామ్మోహన్
  • ప్రజల కోరిక మేరకు రెండు విమాన సర్వీసులు ప్రారంభించామని వెల్లడి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈ రెండు విమాన సర్వీసుల్లో ఒకటి ఎయిరిండియా కాగా, మరొకటి ఇండిగో. ఈ రెండు విమానాలు విశాఖ-విజయవాడ మధ్య తిరగనున్నాయి. 

దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ మధ్య ఫ్లయిట్ కనెక్టివిటీ పెంచాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని అన్నారు. ప్రజల కోరిక మేరకు రెండు నగరాల మధ్య రెండు విమాన సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాలు ప్రారంభించడం ఇదే తొలిసారి అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 

ఆయా రూట్లలో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తే టికెట్ ధరలు తగ్గుతాయని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య విమాన టికెట్ బహుశా రూ.3 వేలు ఉండొచ్చని పేర్కొన్నారు. 

విశాఖ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశాఖ-గోవా మధ్య కూడా విమాన సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, భవిష్యత్తులో విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. 

భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని భోగాపురంలో నెలకొల్పాలని నిర్ణయించామని వెల్లడించారు. 

ఎయిర్ కార్గోపైనా ప్రత్యేక దృష్టి  పెట్టామని, ఆ దిశగా ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని అన్నారు. త్వరలో విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

ఏపీలో విమానయాన అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

నూతన విమాన సర్వీసుల టైమింగ్స్

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్... ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి, 9 గంటలకు విశాఖ చేరుతుంది. 

అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి, 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News