telangana young india skills university: యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి 'మేఘా' సంస్థ భారీ విరాళం

meil to contribute rs 200 crore to telangana young india skills university

  • రూ.200 కోట్లతో స్కిల్ వర్సిటీ భవన నిర్మాణాలకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
  • సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైన మేఘా కృష్ణారెడ్డి, సంస్థ ప్రతినిధి బృందం 
  • ఎంఈఐఎల్ ఫౌండేషన్ ముందుకు రావడం ఆనందంగా ఉందన్న సీఎం 

తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ వర్సిటీ భవన నిర్మాణాలకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ వితరణతో ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా క్యాంపస్ నిర్మాణానికి రూ. 200 కోట్ల భూరి విరాళం ప్రకటించింది. ఈ నిధులతో క్యాంపస్‌లో అవసరమైన భవనాలను మేఘా స్వయంగా నిర్మిస్తుంది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు. మేఘా ఇంజనీరింగ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో  భేటీ అయింది. స్కిల్ వర్సిటీ భవనాల నిర్మాణానికి ఎంఈఐఎల్ ఫౌండేషన్ ముందుకు రావడం ఆనందంగా ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడిందని అన్నారు. 

మేఘా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంపొందించడానికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తుండటంతో తమ వంతుగా రూ.200 కోట్ల విరాళంతో నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.      

  • Loading...

More Telugu News