Visakhapatnam: విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

two new flights between visakha and vijayawada today onwards

  • నేటి నుంచి విశాఖ – విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థల విమాన సర్వీసులు
  • కేంద్ర మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా కొత్త విమాన సర్వీసుల ప్రారంభం
  • ప్రకటన విడుదల చేసిన విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖ - విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్‌లు అవుతున్నాయి. దీంతో కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఈరోజు (ఆదివారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.  
 
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9గంటలకు విశాఖ చేరుతుంది. ఇక ఇండిగో సర్వీసు రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరినట్లు అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించేందుకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

  • Loading...

More Telugu News