Edible oil prices: దీపావళి పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

Edible oil prices have increased significantly during this festive season

  • గత నెలతో పోల్చితే 37 శాతం పెరిగిన పామాయిల్ ధరలు
  • సన్‌ఫ్లవర్, ఆవనూనె ధరల్లోనూ ఇదే పరిస్థితి
  • ధరల పెరుగుదలకు కారణమవుతున్న దిగుమతి సుంకాల పెంపు

దీపావళి పండగకు ముందు సామాన్యులకు చిన్నపాటి బ్యాడ్‌న్యూస్. వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేర పెరిగాయి. సన్‌ఫ్లవర్, ఆవనూనెల ధరలు కూడా గత నెలతో పోల్చితే 29 శాతం పెరిగాయి. పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు కూడా పెరగనున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. 

ధరల పెరుగుదలకు దిగుమతి సుంకాల పెంపు ఒక కారణమని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతం వరకు పెంచిందని పేర్కొంది. ఇక శుద్ధి చేసిన వంట నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచిందని వివరించింది. పెరిగిన సుంకాలు సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది.

వంటనూనెల ధరల పెరుగుదలపై అధికారులు స్పందిస్తూ గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం మేర పెరిగాయని పేర్కొన్నారు. దేశంలో వంటనూనెల డిమాండ్‌లో 58 శాతం దిగుమతి అవుతోందని, భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉందని ప్రస్తావించారు. కాగా దిగుమతి సుంకాలను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేనందున వినియోగదారులు రాబోయే కొద్ది నెలల పాటు అధిక ధరలను భరించాల్సిన రావచ్చు. ఇక కొత్త సోయాబీన్, వేరుశెనగ పంటలు అక్టోబర్ నుంచి మార్కెట్‌లలోకి వస్తాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News