India vs New Zealand: పుణే టెస్టు... కష్టాల్లో భారత్
![India need 181 runs to 2nd Test in Pune](https://imgd.ap7am.com/thumbnail/cr-20241026tn671caff27580b.jpg)
- పుణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు
- శాంట్నర్ విజృంభణతో పీకలోతు కష్టాల్లో టీమిండియా
- 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఎదురీత
- చేతిలో నాలుగు వికెట్లే భారత్ ముందు కొండంత లక్ష్యం
పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురీదుతుంది. 359 పరుగుల లక్ష్యఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆరంభంలో ధాటిగానే ఆడిన రోహిత్ సేన ఆ తర్వాత ఢీలాపడింది. మరోసారి మిచెల్ శాంట్నర్ విజృంభణతో భారత బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. ఇప్పటివరకు భారత్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు అతనికే దక్కాయి.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (77) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. గిల్ (23) తో కలిసి జైస్వాల్ రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 181 పరుగులు కావాలి. టీమిండియా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో జడేజా (4), అశ్విన్ (9) ఉన్నారు.