CDSCO: 3000 ఔషధాలకు నాణ్యతా పరీక్షలు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

CDSCO flagged 49 drugs for not meeting standards

  • సీడీఎస్‌సీవో నాణ్యతా పరీక్షల్లో విఫలమైన 49 మందులు
  • ఈ జాబితాలో కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డీ3 టాబ్లెట్స్
  • 1 శాతం మందులు నాణ్యంగా లేవన్న సీడీఎస్‌సీవో చీఫ్ రాజీవ్ సింగ్

ఔషధాల నాణ్యతా పరీక్షలకు సంబంధించిన సెప్టెంబర్ నెల రిపోర్ట్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ప్రచురించింది. మొత్తం 3000 ఔషధాలను పరీక్షించగా 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించింది. నాణ్యతా పరీక్షలో విఫలమైన మందుల జాబితాలో లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసే కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డీ3 250 ఐయూ టాబ్లెట్స్‌తో పాటు ఇతర మందులు ఉన్నాయని వెల్లడించింది.

హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ తయారు చేసే మెట్రోనిడాజోల్ టాబ్లెట్స్, రెయిన్‌బో లైఫ్ సైన్సెస్ ఉత్పత్తి చేసే డోంపెరిడోన్ మాత్రలు, పుష్కర్ ఫార్మా తయారు చేసే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు కూడా నాణ్యంగా లేవని సీడీఎస్‌సీవో తెలిపింది. స్విస్ బయోటెక్ పేరెంటరల్స్‌కు చెందిన మెట్‌ఫార్మిన్, ఆల్కెమ్ ల్యాబ్స్‌కు చెందిన పాన్ 40, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే పారాసిటమాల్ మాత్రలతో పాటు డైక్లోఫినాక్ సోడియం టాబ్లెట్లలో కూడా నాణ్యత సమస్యలు ఉన్నాయని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

నకిలీ కంపెనీలు తయారు చేసిన నాలుగు ఔషధాలు కలుషితమైనవని గుర్తించామని సీడీఎస్‌సీవో పేర్కొంది. ప్రామాణికంగా లేని మందులను బ్యాచ్‌ల వారీగా రీకాల్ చేశామని, జనాల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నామని వివరించింది.

పరీక్షించిన అన్ని ఔషధాలలో కేవలం 1 శాతం మాత్రమే నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాయని సీడీఎస్‌సీవో చీఫ్ రాజీవ్ సింగ్ రఘువంశీ తెలిపారు. కఠినమైన పర్యవేక్షణ చేస్తున్నామని, నాణ్యత లేని ఔషధ ఉత్పత్తులను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News