ACC Emerging Teams Asia Cup 2024: భారత్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్‌లో ఓటమితో టీమిండియా ఇంటిముఖం!
![ACC Emerging Teams Asia Cup 2024 India A Stunned By Afghanistan A Lose Semi Final By 20 Runs](https://imgd.ap7am.com/thumbnail/cr-20241026tn671c4890cd746.jpg)
- ఏసీసీ పురుషుల టీ20 ఆసియా కప్ 2024 సెమీస్‌లో తలపడ్డ భారత్-ఏ, ఆఫ్ఘనిస్థాన్-ఏ
- 20 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
- ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్
- 20 ఓవర్లలో 186 రన్స్‌కే పరిమితమైన భారత జట్టు
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత-ఏ జట్టుకు, ఆఫ్ఘనిస్థాన్-ఏ జట్టు షాకిచ్చింది. ఒమన్‌లో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియాను ఆఫ్ఘన్ చిత్తు చేసింది. భారత్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 207 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 186 రన్స్ చేసింది. దాంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆఫ్ఘన్ ఓపెనర్లు జుబైద్ అక్బరీ (64), సెడిఖుల్లా అటల్ (83) ఏకంగా 137 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. ఈ అద్భుతమైన భాగస్వామ్యానికి తోడు చివరలో కరీం జనత్ అంతే అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. అతడు 20 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఆఫ్ఘనిస్థాన్ 206 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 186 పరుగులకే పరిమితమైంది. పవర్‌ప్లేలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లతో పాటు కెప్టెన్ తిలక్ వర్మను పవర్‌ప్లేలోనే కోల్పోయింది. రమణదీప్ సింగ్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, భారత్ చివర్లో 20 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది.