Chandrababu: బాలకృష్ణతో చంద్రబాబు అన్ స్టాపబుల్... హైలైట్స్ ఇవిగో!

Chandrababu attends Unstoppable with NBK Talk Show

  • అన్ స్టాపబుల్ సీజన్-4 ప్రారంభం
  • తొలి ఎపిసోడ్ కు గెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు
  • తన అరెస్ట్, జైలుకెళ్లడం గురించి బావమరిది బాలయ్యతో పంచుకున్న వైనం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్ టాక్ షో నాలుగో సీజన్ మొదలైంది. ఆరంభ ఎపిసోడ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బావమరిది, బావ మధ్య ఆసక్తికర ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.

గతంలోనూ తాను అన్ స్టాపబుల్ టాక్ షోకి వచ్చానని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత ప్రజలు గెలవాలన్న లక్ష్యంగా కృషి చేసి విజయం అందుకున్నామని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరోసారి అన్ స్టాపబుల్ షోకి వచ్చానని వివరించారు. 

మీరు అన్ స్టాపబుల్... మేం రాజకీయాల్లో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు చమత్కరించారు. ఇక, తాను మొదటిసారిగా జైలులో అడుగుపెట్టిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాడు నంద్యాలలో నోటీసులు లేకుండా అరెస్ట్  వారెంట్ ఇచ్చారని, గట్టిగా అడిగితే, తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 

ఏ తప్పు చేయని నాకు అలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు... నిప్పులా బతికిన నాకు ఆ ఘటనను జీర్ణించుకోవడం చాలా కష్టమైంది అని వివరించారు. దర్యాప్తు అధికారి కాకుండా మరొకరు వచ్చారు... మీరెవరంటే  సూపర్ వైజింగ్ ఆఫీసర్ ని అని బదులిచ్చాడు... ఏం చేసినా చెల్లుతుందని అహంకారపూరితంగా వ్యవహరించారు... అంటూ చంద్రబాబు వెల్లడించారు. 

"నంద్యాలలో నన్ను అరెస్ట్ చేయడం నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లే వరకు మధ్యలో ఎన్నో జరిగాయి. దర్యాప్తు అంటూ రాత్రంతా తిప్పారు. వేకువజామున వైద్య పరీక్షలకు పంపించారు... విపరీతంగా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు... కోర్టులో సాయంత్రం వరకు వాదనలు జరిగాయి.. చివరికి అర్ధరాత్రి వేళకు జైలుకు తరలించారు... ఇవన్నీ తలచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. నా జైలు జీవితం గురించి ఎవరైనా ఓ పుస్తకం రాయొచ్చు. 

ఓ నేతకు కష్టం వస్తే ప్రజలు ఎలా స్పందిస్తారన్నది నా విషయంలో చూశాను. రాజకీయాల్లో కుటుంబం కంటే ప్రజల కోసమే ఎక్కువ సమయం కేటాయించాను... జైల్లో 53 రోజులు ఉన్న తర్వాత బయటికొచ్చి ప్రజలను చూడగానే సంతోషం కలిగింది. 

నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనతో నేను మాట్లాడింది రెండే నిమిషాలు... పొత్తుపై నేనే ప్రతిపాదన చేశాను... అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోమని పవన్ ను కోరాను... కానీ ఆయన జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే పొత్తు ఉంటుందని ప్రకటించారు.... బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పారు... కూటమి విజయానికి పునాది అక్కడే పడింది. 

ఒకవేళ నేను అరెస్ట్ కాకపోయినా కూటమి ఏర్పడేది అనుకుంటున్నా. తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు పరీక్షలు ఎదురవుతుంటాయి.. వాటిని ఎదుర్కోవాల్సిందే" అని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News