Salman Khan: ఇప్పటికీ చల్లారని ఆగ్రహం... సల్మాన్ ఖాన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన బిష్ణోయ్ ప్రజలు

Bishnoi people burns Salman Khan effigies in Jodhpur

  • గతంలో కృష్ణ జింకలను కాల్చి చంపినట్టు సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు
  • 2018లో సల్మాన్ కు జైలుశిక్ష... బెయిల్ పై బయటికొచ్చిన హీరో
  • తన కుమారుడు నిర్దోషి అంటూ ఇటీవల సలీమ్ ఖాన్ వ్యాఖ్యలు
  • మండిపడిన బిష్ణోయ్ ప్రజలు

వన్యప్రాణులను, ముఖ్యంగా కృష్ణ జింకలను తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే బిష్ణోయ్ ప్రజల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పట్ల ఇప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారలేదు. తాజాగా, బిష్ణోయ్ తెగ ప్రజలు సల్మాన్ ఖాన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ దిష్టిబొమ్మలను కూడా వారు తగులబెట్టారు. 

ఇటీవల సలీమ్ ఖాన్ మాట్లాడుతూ, తన కుమారుడు కృష్ణ జింకలను వేటాడలేదన్నారు. దాంతో, బిష్ణోయ్ సామాజిక వర్గీయుల్లో ఆగ్రహజ్వాలలు భగ్గుమన్నాయి. ఇవాళ రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో బిష్ణోయ్ తెగకు చెందిన వారు ధర్నా చేపట్టారు. బిష్ణోయ్ ధర్మ స్థాపన దివస్ పర్వదినం సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి బిష్ణోయ్ ప్రజలు జోథ్ పూర్ వచ్చారు. ఈ సందర్భంగా వారు నిరసనలో పాల్గొన్నారు. 

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడకపోతే... అతడి కేసును వాదించేందుకు ఢిల్లీ, ముంబయి, జోథ్ పూర్ నుంచి  న్యాయవాదులు ఎందుకు రావాల్సి వచ్చింది? అని బిష్ణోయ్ ప్రజలు ప్రశ్నించారు. తన కుమారుడు కృష్ణ జింకలను చంపలేదని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ అంటున్నారు... మరి సల్మాన్ ఖాన్ జోథ్ పూర్ వరకు ఎందుకు వచ్చారు? అని వారు నిలదీశారు. 

అంతేకాదు, సల్మాన్ ఖాన్ పై పగబట్టిన లారెన్స్ బిష్ణోయ్ తమ సామాజిక వర్గానికి చెందినవాడేనని, తమ సామాజిక వర్గం నిర్దేశించిన 29 సూత్రాలు అతడికి కూడా వర్తిస్తాయని తెలిపారు. 

గతంలో రాజస్థాన్ లో సినిమా షూటింగ్ విరామంలో వేటకు వెళ్లి కృష్ణ జింకలను వేటాడి చంపినట్టు సల్మాన్ ఖాన్ పై చాలాకాలం పాటు కేసు నడిచింది. 2018లో సల్మాన్ ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ ఖాన్ ఈ కేసులో బెయిల్ పై బయటికొచ్చారు.

  • Loading...

More Telugu News