Washington Sundar: 'వాషింగ్టన్' సుందర్ పేరు వెనక ఉన్న అసలు కథ ఇదే!

Story Behind Washington Sundar Name

  • పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య‌ రెండో టెస్టు
  • 7 వికెట్ల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును కుప్ప‌కూల్చిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌
  • దీంతో ఒక్క‌సారిగా మార్మోగిపోతున్న ఆల్ రౌండ‌ర్ పేరు 
  • అస‌లు సుంద‌ర్ పేరు ముందు 'వాషింగ్ట‌న్' ఎలా చేరిందంటూ వాకబు

పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ ఏకంగా ఏడు వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. 23 ఓవ‌ర్ల పాటు బౌలింగ్ వేసిన సుంద‌ర్ కేవ‌లం 59 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ పేరు మార్మోగిపోతోంది. 

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సుందర్ ఈ టెస్టు తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. కెప్టెన్‌, కోచ్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సుందర్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్‌ బ్యాటర్లను ప‌దునైన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు.

మొత్తంగా 23.1 ఓవర్ల‌ తన స్పెల్‌లో నాలుగు మెయిడన్లు వేశాడు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేశాడు. సుంద‌ర్ ఏడు వికెట్లకు తోడు మ‌రో స్పిన్న‌ర్ అశ్విన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో కివీస్ 259 ర‌న్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో ఒక్క‌సారిగా భారత క్రికెట్లో వాషింగ్ట‌న్ సుందర్ పేరు బాగా వినిపిస్తోంది. అస‌లు సుంద‌ర్ పేరు ముందు వాషింగ్ట‌న్ ఎలా చేరింది దాని వెనుక ఉన్న క‌థ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. 

'వాషింగ్టన్' పేరు వెనుక ఉన్న క‌థ ఇదే!
వాషింగ్టన్ సుందర్‌ తండ్రి పేరు మణి సుందర్‌. ఒకప్పుడు ఆయన రంజీ ఆట‌గాడు. ఆయ‌న‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ మణి సుందర్‌ది నిరుపేద‌ కుటుంబం కావ‌డంతో ఆర్థికంగా ఆయ‌న‌కు తోడ్పాటు ఉండేది కాదు. 

ఆ సమయంలో పీడీ వాషింగ్టన్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ అధికారి మణి సుందర్‌కు చిన్నతనంలో క్రికెట్‌ ఆడేందుకు ఆర్థికంగా సాయం చేశారు. ఆయ‌న చదువుకు అయ్యే వ్య‌యాన్ని సైతం భరించారు. దాంతో పీడీ వాషింగ్టన్‌ అంటే మణి సుందర్‌కు ఎంతో అభిమానం ఏర్ప‌డింది. ఆ అభిమానంతోనే  మణి సుందర్ తన కుమారుడికి వాషింగ్టన్‌ అనే పేరు పెట్టారు. 

ఇప్పుడు టీమిండియాలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద‌ర‌గొడుతుండ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. దాంతో అస‌లు ఈ త‌మిళ‌తంబి పేరు ముందు ఇంగ్లిష్ పేరు ఎలా చేరింద‌బ్బా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. సో.. అత‌ని పేరు ముందు వాషింగ్ట‌న్ చేర‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇద‌న్న‌మాట‌. 

  • Loading...

More Telugu News