Jeevan Reddy: పార్టీ ఫిరాయించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే: జీవన్ రెడ్డి

Jeevan Reddy says should take action mlas who joined congress from brs

  • పార్టీ అధిష్ఠానం తన ఆవేదనను పరిగణలోకి తీసుకుంటుందనే నమ్మకం ఉందన్న సీనియర్ నేత
  • క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా ఆవేదనను అధిష్ఠానానికి చెప్పానన్న జీవన్ రెడ్డి
  • ఏ రాజకీయ పార్టీ అయినా నైతిక విలువలు ఉండాలని వ్యాఖ్య

ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని... చట్టం కూడా అదే చెబుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తన ముఖ్య అనుచరుడు హత్యకు గురైనప్పటి నుంచి సొంత పార్టీ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా, ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన ఆవేదనను పరిగణలోకి తీసుకుంటారని, పార్టీ మీద నమ్మకంతోనే అధిష్ఠానానికి తాను ఫిరాయింపులకు సంబంధించి లేఖ రాశానన్నారు.

రాహుల్ గాంధీ ఆలోచనలు, తమ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగానే తాను ఫిరాయింపులపై మాట్లాడానన్నారు. రాహుల్ గాంధీపై తనకు నమ్మకం ఉందన్నారు.

ఏఐసీసీ అనుమతితోనే చేరికలు జరిగాయన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కూడా జీవన్ రెడ్డి స్పందించారు. పెద్దల అనుమతి ఉండవచ్చని... కానీ రాహుల్ గాంధీ ఆలోచననే తాను చెప్పానన్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా నైతిక విలువలు ఉండాలన్నారు.

త్యాగాల పునాదులపై కాంగ్రెస్ ఈ స్థాయికి వచ్చిందన్నారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని, కానీ నైతిక విలువల విధానం కావాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ కాలికి బలపం పట్టుకొని తిరిగి దేశమంతా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఫిరాయింపులపై వెంటనే చర్యలు ఉండాలని రాహుల్ గాంధీ కూడా చెప్పారు కదా... అంటే ఆయన మాటకు ఇక్కడి ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... ఫిరాయింపుల వెనుక ఎవరు ఉన్నారో చూద్దామన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తన ఆవేదనను వ్యక్తం చేశానన్నారు. నా ఆలోచనకు, నా ఆవేదనను పార్టీ గుర్తిస్తుందని నమ్మకం ఉందన్నారు.

  • Loading...

More Telugu News