Perni Nani: చెల్లెలిపై ప్రేమ ఉండడం వల్లే జగన్ ఆస్తులు రాసిచ్చారు: పేర్ని నాని

Perni Nani press meet over YS family assets row

  • రచ్చకెక్కిన జగన్ కుటుంబ ఆస్తుల వ్యవహారం
  • విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ నేతలు
  • జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారన్న పేర్ని నాని
  • అందుకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శలు

వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే టీడీపీకి ఏమాత్రం పట్టదని, కానీ పెద్ద భూకంపం వచ్చినట్టుగా, ఏపీ బద్దలైపోతుందన్నట్టుగా జగన్ కుటుంబ వ్యవహారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

దేశంలోనే మొదటిసారి... తల్లి, చెల్లిపై కేసులు పెట్టిన జగన్, మార్కెట్లోకి మరో సంచలనంతో వస్తున్న శాడిస్టు, ఇలాంటి కష్టం ఏ చెల్లికి రాకూడదు, సొంత తల్లిపై కేసులు పెట్టిన సైకో జగన్, చెల్లి షర్మిల రాజకీయ జీవితంపై జగన్ అసూయ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని తెలిపారు. ప్రజల్లో జగన్ స్థానాన్ని దెబ్బతీయాలని, రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేకపోతున్నాం కాబట్టి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. 

"రాజశేఖర్ రెడ్డి గారు మరణించకముందే ఆస్తుల పంపకాలు చేశారు. జగన్ కు ఇవ్వాల్సినవి జగన్ కు ఇచ్చారు... షర్మిలకు ఇవ్వాల్సినవి షర్మిలకు ఇచ్చారు... బంజారాహిల్స్ లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్  కంపెనీ నూటికి నూరు శాతం పంపకాలు చేశారు. 

ఇవే కాకుండా పలు కంపెనీలు కూడా ఉన్నాయి... జగన్ వ్యాపారంలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగే క్రమంలో భారతి సిమెంట్స్, సాక్షి పేపర్ ఏర్పాటయ్యాయి. పల్నాడులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటైంది. సరస్వతి సంస్థ ఇంకా ఏర్పాటు కాలేదు కానీ, భూ సేకరణ జరిగింది, అనుమతులు అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీలు జగన్ స్వార్జితపు ఆస్తుల్లో భాగం. ఎన్నికల అఫిడవిట్, ఇతర రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 

నెల్లూరు జిల్లాలో ఒక పండితుడు ఉన్నాడు... ఐదారుసార్లు డింకీలు కొట్టి మొన్న గెలిచాడు! సరస్వతి సంస్థ భూములు గవర్నమెంట్ లీజు అని ఆ పండితుడు అంటున్నాడు. కానీ రైతులకు డబ్బులిచ్చి ఆ భూములు కొనుగోలు చేశారు" అని పేర్ని నాని వివరించారు. 

ఇక, చెల్లెలు షర్మిలపై ప్రేమ ఉండబట్టే జగన్ ఆస్తులు రాసిచ్చారని పేర్ని నాని స్పష్టం చేశారు. పొరుగింట్లో గొడవ జరిగితే చంద్రబాబుకు అంత ఆనందం ఎందుకు? కుటుంబ విషయాలను అడ్డంపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ఆస్తుల్లో చెల్లెలికి వాటాలు ఎప్పుడైనా రాశారా? అని ప్రశ్నించారు.

షర్మిలపై జగన్ కు ప్రేమ ఉంది కాబట్టే, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టారని... ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తులు, వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేశారని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News