KTR: పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే: కేటీఆర్
- 165 ఏఈఓలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్న కేటీఆర్
- 2 లక్షల ఉద్యోగాలు కాదు.. ఉన్నవి తీసేస్తున్నారని ఆగ్రహం
- సామాన్యులు మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్లపైకే వస్తున్నారని ఆవేదన
- సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమవుతున్నారని మండిపడ్డారు. 165 ఏఈఓలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. హక్కులు అడిగితే వేటు వేస్తారా? అని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కార్ ఊడపీకుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యులు మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్లపైకే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.