Gold Prices: జీవితకాల గరిష్ఠానికి చేరిన బంగారం, వెండి ధరలు

Gold and silver prices breached fresh record high level

  • రూ.81,500లకు చేరిన 10 గ్రాముల పసిడి రేటు
  • వెయ్యి పెరిగి రూ.1.02 లక్షలకు చేరిన వెండి
  • పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో భారీ డిమాండ్‌

బంగారం, వెండి ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. విలువైన ఈ ఆభరణాల రేట్లు తాజాగా సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. వరుసగా ఆరవ సెషన్‌లో పెరుగుదల నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.81,500కి చేరింది. ఇది జీవితకాల గరిష్ఠమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ ఏర్పడడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది.

బుధవారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.500 మేర పెరిగి రూ.81,500కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81,100కి పెరిగింది. ఇక కిలో వెండి రూ.1000 మేర పెరిగి రూ.1.02 లక్షలకు ఎగబాకింది. ఈ పెంపుతో మంగళవారం రూ.1.01 లక్షలుగా ఉన్న కిలో వెండి రూ.1.02 లక్షలకు చేరుకుంది.

వెండి ధరలు జీవితకాల గరిష్ఠానికి పెరగడంపై ఎస్‌కేఐ క్యాపిటల్ ఎండీ నరీందర్ వాధ్వా స్పందించారు. దుకాణాలలో, ఎంసీఎక్స్‌లో వెండి ధరలు లక్ష రూపాయలకు చేరుకోవడానికి దేశంలో నెలకొన్న డిమాండ్, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం వంటి పలు అంశాలే కారణాలుగా ఉన్నాయని అన్నారు.  

నిజానికి జులై నెలలో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ఆ ప్రభావంతో స్థానిక మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా 7 శాతం మేర తగ్గాయి. అయితే తాజాగా పండగ సీజన్‌లో డిమాండ్, యూఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గవచ్చనే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బులియన్ మార్కెట్‌లో ధరలు పుంజుకున్నాయి.

  • Loading...

More Telugu News