Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం

PrM Narendra Modi and Chinese President Xi Jinping met in Russia first since 2019

  • కజాన్‌లో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాధినేతలు
  • ఇరుదేశాల బంధాలు ప్రపంచ పురోగతికి కూడా ముఖ్యమన్న ప్రధాని మోదీ
  • మరిన్ని సంప్రదింపులు, సహకారాన్ని సూచించిన జిన్‌పింగ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య చారిత్రాత్మక భేటీ జరిగింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు కజాన్ నగరంలో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాన మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తమ మధ్య ఈ భేటీ జరిగిందని అన్నారు. భారత్-చైనా సంబంధాల ఆవశ్యకత ఇరు దేశాల పౌరులకు మాత్రమే ప్రయోజనకరం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సమస్యలు అన్నింటిపై మాట్లాడే అవకాశం తమకు ఇవాళ దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ముందుకు సాగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ చెప్పారు.

సరిహద్దు వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలపై ఏకాభిప్రాయం కుదరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడం తమ ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

అంతర్జాతీయ సమాజం ఇటువైపే చూస్తోంది: జెన్‌పింగ్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తొలి అధికారిక ద్వైపాక్షిక సమావేశం ఇదేనని అన్నారు. ఇరుదేశాలకు చెందిన ప్రజలు, అంతర్జాతీయ సమాజం అంతా ఇటువైపు చూస్తున్నారని అన్నారు. ఇరుదేశాలకు పురాతన నాగరికతలు ఉన్నాయని, రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలేనని అన్నారు. ఇరుదేశాలు కీలకమైన దక్షిణ దేశాలుగా ఉన్నాయని అన్నారు. ఆధునికీకరణ పురోగతిలో ముఖ్యమైన దశలో ఉన్నామని జిన్‌పింగ్ ప్రస్తావించారు. ఇరు దేశాల చరిత్ర, ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో కొనసాగించడం ఇరుదేశాలకు, పౌరుల ఆసక్తులకు ప్రయోజనకరమని అన్నారు. 

అభివృద్ధి కాంక్షల దృష్ట్యా ఇరు దేశాలు మరిన్ని సంప్రదింపులు, సహకారాన్ని పెంపొందించుకోవడం, విభేదాలను సరైన విధానంలో పరిష్కరించుకోవడం, సరిహద్దులో బలగాలను ఉపసంహరించుకోవడం చాలా ముఖ్యమని జిన్‌పింగ్ సూచించారు.

  • Loading...

More Telugu News