Cheteshwar Pujara: ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా నిలిచిన ఈ ఆటగాడికి బీసీసీఐ చోటిస్తుందా?

Cheteshwar Pujara could be a surprise pick in Indias jumbo squad for the Border Gavaskar trophy

  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి జట్టు ప్రకటించనున్న నేపథ్యంలో తెరపైకి పుజారా పేరు
  • 103 టెస్టుల అనుభవమున్న ఈ ఆటగాడికి చోటిస్తే రాణిస్తాడనే అంచనాలు
  • గతంలో పర్యటనల్లో అదరగొట్టిన పుజారా

ఏకంగా 103 టెస్ట్ మ్యాచ్‌ల అనుభవం ఉన్న టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా జట్టులో స్థానాన్ని కోల్పోయి చాలా కాలమే అయింది. చివరిగా గతేడాది జూన్‌లో జరిగిన వరల్డ్  టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు. ఆ తర్వాత అతడికి జట్టులో చోటు దక్కలేదు. జాతీయ జట్టులో ఆడకపోయినప్పటికీ దేశవాళీ, కౌంటీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఇటీవలే రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతడికి 18వ అర్ధ సెంచరీ. కాగా నవంబర్ నెలలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ఆశ్చర్యకరంగా అనుభవజ్ఞుడైన పుజారాను ఎంపిక చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనల్లో పుజారా చక్కటి అనుభవం ఉంది. గత రెండు పర్యటనల్లో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కాగా 36 ఏళ్ల పుజారా 2018-19 సిరీస్‌లో ఏకంగా 1,258 బంతులు 521 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. మూడేళ్ల తర్వాత జరిగిన సిరీస్‌లో 928 బంతుల్లో 271 పరుగులు సాధించి భారత బ్యాటింగ్‌ లైనప్‌కు వెన్నెముకగా నిలిచాడు. కాబట్టి ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే అజిత్ అగార్కర్ సారధ్యంలోని సెలక్టర్ల బృందం అతడికి జట్టులో చోటు ఇచ్చే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో అత్యధిక టెస్టు బంతులను ఎదుర్కొన్న ప్లేయర్ పుజారా కావడం విశేషం. కాబట్టి ప్రత్యర్థి జట్టులోని ప్యాట్ కమ్మిన్స్, జాస్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లతో కూడిన బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టుని అక్టోబరు 28న సెలెక్టర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి సెలక్టర్లు ఏం చేస్తారో వేచిచూడాలి.

  • Loading...

More Telugu News