David Warner: రిటైర్‌మెంట్‌పై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

David Warner has confirmed that he is always available and can play if the team needs him

  • జట్టుకు తాను అవసరమైతే ఆడేందుకు సిద్ధమన్న మాజీ దిగ్గజం
  • ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ వ్యాఖ్య
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం డేవిడ్ వార్నర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. జట్టుకు అవసరమైతే తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పాడు. ‘‘నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఫోన్ ఎత్తడానికి సిద్ధంగా ఉంటాను. నిజం చెప్పాలంటే ఫిబ్రవరి తర్వాత మా ప్లేయర్లు కొన్ని టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. కాబట్టి నేను కూడా దాదాపు అంతే సన్నద్ధతతో ఉన్నాను. తిరిగి రావడానికి నేను సిద్ధం’’ అని ‘కోడ్ స్పోర్ట్స్‌’తో మాట్లాడుతూ వార్నర్ అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిరూపించుకోవడానికి సిద్ధమని వార్నర్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి జట్టుకు నిజంగా తన అవసరం ఉంటే ఫస్ట్ క్లాస్‌లో ఆడేందుకు సంతోషిస్తానని చెప్పాడు. ఆటకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో రిటైర్‌మెంట్ ప్రకటించానని, జట్టుకు అవసరమైతే తన చేయి అందించడానికి దూరంగా ఉండబోనని అన్నాడు.

కాగా ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో వార్నర్ టెస్ట్ సిరీస్‌కు ముగింపు పలికాడు. అప్పటినుంచి ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ సమస్యను ఎదుర్కొంటోంది. ఉస్మాన్ ఖవాజాకు సరైన ఓపెనర్‌ను ఇంకా అన్వేషిస్తూనే ఉంది. 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా ప్రయత్నిస్తున్నాడు. కానీ గత 8 ఇన్నింగ్స్‌లలో అతడి ప్రదర్శన పేలవంగా ఉంది. 28.50 సగటుతో కేవలం 171 పరుగులు మాత్రమే చేశాడు. బ్రిస్బేన్‌ టెస్టులో వెస్టిండీస్‌పై సాధించిన 91 పరుగులు ఏకైక అర్ధ సెంచరీగా ఉంది. 

దీంతో తిరిగి మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు స్మిత్ ధ్రువీకరించాడు. దీంతో ఓపెనర్ విషయంలో ఆస్ట్రేలియా జట్టు అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మార్కస్ హారిస్, కామెరాన్‌ బాంక్‌ఫోర్ట్‌లతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో రాణిస్తున్న సామ్ కొంటాస్ ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్నాడు. కాగా నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News