Multi Level Parking: పార్కింగ్ కష్టాలకు చెక్.. నాంపల్లిలో పది అంతస్తుల పార్కింగ్ భవనం!

10 Story Multi Level Parking Building Now Ready In Hyderabad

  • మరో రెండు నెలల్లో అందుబాటులోకి
  • 250 కార్లు, 200 బైక్‌లు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు
  • రూ. 80 కోట్లతో నిర్మిస్తున్న మెస్సర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
  • భవనంలో రెండు సినిమా తెరలు కూడా..

హైదరాబాద్‌లో తొలిసారి పార్కింగ్ కోసమే ఏకంగా 10 అంతస్తుల భవనం అందుబాటులోకి రానుంది. అది కూడా మరో రెండు నెలల్లోనే సిద్ధం కానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. నాంపల్లి చౌరస్తాలోని మెట్రోకు ఉన్న అరెకరం స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. మెస్సర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 80 కోట్లతో దీనిని నిర్మిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే నాంపల్లి చుట్టుపక్కల వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తీరుతాయి. మరీ ముఖ్యంగా నుమాయిష్ సమయంలో సందర్శకుల పార్కింగ్ కష్టాలకు చెక్ పడుతుంది.

ప్రత్యేకతలు ఇవే..
భవనం కింది అంతస్తులో వాహనాల పార్కింగ్ కోసం నాలుగు టెర్మినళ్లు ఉన్నాయి. వాహనం పార్కింగ్ కోసం టర్న్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఇది వాహనాన్ని పార్క్ చేస్తుంది. జర్మన్ సాంకేతికతతో భవనంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్టు షటిల్ లిఫ్ట్ ద్వారా వాహనాన్ని కింది నుంచి నిర్ణీత అంతస్తుకు తీసుకెళ్లి ఖాళీ స్థలంలో పార్కింగ్ చేస్తుంది. 

అంతా రెండు నిమిషాల్లోపే..
వాహనం తీసుకునేందుకు వెళ్లినప్పుడు పార్కింగ్ టికెట్‌ను కార్డ్ రీడర్‌కు చూపించిన వెంటనే ట్రాన్స్‌పోర్ట్ షటిల్ ఆటోమెటిక్‌గా ఆ వాహనాన్ని యజమానికి అందిస్తుంది. పార్కింగ్ కోసం నిమిషం.. తిరిగి పొందేందుకు రెండు నిమిషాల సమయం పడుతుంది. కాగా, ఈ భవన సముదాయంలో రెండు సినిమా తెరలు, హోటళ్లు కూడా ఉంటాయి.  ఈ భవనంలో మొత్తం 250 కార్లు, 200 బైక్‌లు పార్కింగ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News