T20 Womens World Cup 2024: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 విజేత న్యూజిలాండ్

New Zealand is the world champions of T20 Womens World Cup 2024

  • ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన కివీస్
  • 32 పరుగుల తేడాతో ఘన విజయం
  • బ్యాటింగ్, బౌలింగ్‌‌లలో రాణించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అమేలియా

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉమెన్స్ టీమ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసి కివీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఉమెన్స్ విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 32 పరుగుల తేడాతో వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.

టైటిల్ పోరులో న్యూజిలాండ్ ఉమెన్స్ అన్ని విభాగాల్లోనూ రాణించారు. బ్యాటింగ్‌లో సుజీ బేట్స్ 32, అమేలియా 43, బ్రూకీ 38 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా ఉమెన్స్ బౌలర్లలో మాబా 2 వికెట్లు, ఖాకా, ట్రైయోన్, నదినే తలో వికెట్ చొప్పున తీశారు. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 33 పరుగులు మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఇక కివీస్ బౌలర్లలో రోజ్మేరీ మెయిర్, అమేలియా చెరో మూడు వికెట్లతో అదరగొట్టారు. ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, బ్రూకీ తలో వికెట్ తీసి.. కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన అమేలియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

కాగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వరుసగా 10 పరాజయాలను మూటగట్టుకుంది. 2022 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం వరకు కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మెగా టోర్నీలో రాణించారు. ప్రారంభ మ్యాచ్‌లో భారత ఉమెన్స్‌ను ఓడించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ మినహా మిగతా అన్ని మ్యాచ్‌లను న్యూజిలాండ్ ఉమెన్లు సొంతం చేసుకున్నారు.

More Telugu News