KTR: రేవంత్ రెడ్డి ముందే చెప్పాడు... ఆయనను అనడానికి వీల్లేదు: కేటీఆర్ వ్యంగ్యం

KTR satires on CM Revanth Reddy over poll promises

  • అలయ్ బలయ్ నిర్వహించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • హాజరైన కేటీఆర్
  • రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేడు దసరా సమ్మేళనం అలయ్ బలయ్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరైన ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

రేవంత్ రెడ్డి చెప్పేది ప్రతిదీ అబద్ధమేనని అన్నారు. ఒకటి, రెండు కాదు... అన్నీ అబద్ధపు హామీలే... మోసం చేస్తానని రేవంత్ రెడ్డి ముందే చెప్పాడు... అందుకే ఆయనను ఏమీ అనడానికి వీల్లేదు అంటూ కేటీఆర్ ఎత్తిపొడిచారు. 

"మహిళలకు తులం బంగారం అన్నాడు... ఏమైంది? గత 11 నెలల్లో 4 లక్షల వివాహాలు జరిగాయి... త్వరలో మరో 2 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికైనా తులం బంగారం ఇవ్వాలి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని కూడా చెప్పాడు... ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు. ఇంట్లో వృద్ధులకు, కోడలికి పింఛను అన్నాడు... ఒక్కరికైనా ఇచ్చాడా? 

ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు... ఆ ఉచిత ప్రయాణాల్లో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ 11 నెలల్లో ఒక్క మంచి పని అయినా చేశాడా? మంత్రిగా కూడా అనుభవం లేదు... ఏంచేస్తావంటే ఏముంది... గుంపు మేస్త్రీ మాదిరిగా పనిచేస్తా అన్నాడు! ఇప్పుడొచ్చి అందరి ఇళ్లను కూలగొడుతున్నాడు. 

సోనియా గాంధీని నాడు బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు... కాంగ్రెస్ పార్టీని కుంభకోణాల పార్టీ అన్నాడు... ఇప్పుడు సోనియా గాంధీని దేవత అంటున్నాడు. 

రెండు పంటలకు కాదు, మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడు. కాంగ్రెస్ వస్తే రూ.15 వేలు ఇస్తాం అన్నాడు. కానీ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పాడు. రైతు భరోసా ఏదీ అంటే ఈ ఖరీఫ్ సీజన్ కు పైసలు లేవు అన్నాడు. ఖరీఫ్ రైతు భరోసా ఎగ్గొడుతున్నాం అంటూ సిగ్గులేకుండా చెప్పాడు. ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు... రైతు భరోసా రాదు. 

25 సార్లు ఢిల్లీ వెళ్లాడు... 25 పైసలు కూడా తెచ్చుకోలేదు. రాష్ట్రమంతా నాశనం చేస్తున్నాడు. అశోక్ నగర్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియాలో చూస్తున్నాం... కానీ ప్రధాన మీడియాలో చూపించడంలేదు. మరో రెండు నెలలు గడిస్తే ఏడాది అవుతుంది... ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలో ఇచ్చారో చెప్పాలి. 

రాహుల్ గాంధీ గతేడాది అశోక్ నగర్ వచ్చి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? పిల్లలకు ఉద్యోగాల సంగతేమో కానీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. వీళ్లు ఇచ్చిన జీవో 29తో రిజర్వేషన్ల అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ విద్యార్థులను కొడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలి... ఆ విద్యార్థుల్లోంచే మీ బాస్ లు (భావి ఐపీఎస్ లు) వస్తారన్న విషయం గుర్తుంచుకోవాలి" అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. 

"గత ఎన్నికల్లో ఓటమిపాలవడానికి మనం కూడా చిన్న తప్పులు కొన్ని చేశాం. ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే. మోసపోయామంటూ దసరా రోజున రాష్ట్రమంతటా ప్రజలు బాధపడ్డారు. అందరూ కేసీఆర్ ను గుర్తుచేసుకున్నారు" అంటూ కేటీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News